భారత్‌-ఆసీస్‌ మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ల కంటే ముందు మైండ్‌గేమ్‌ మొదలవుతుంది. ఈ ఏడాది ఆరంభంలో భారత్‌-ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్‌ జరిగే సమయంలోనూ మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఆసీస్‌ జర్నలిస్టు ఒకరు కోహ్లీ సేనను కార్మికులతో పోల్చడం వివాదాస్పదమైంది.

స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో భాగంగా గతంలో కోహ్లీ సేన కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్‌ మైదానాన్ని శుభ్రం చేసింది. దీనికి సంబంధించిన ఫొటోని డెన్నిస్‌ ఫ్రీడ్‌మాన్‌ అనే ఆసీస్‌ జర్నలిస్టు తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేశారు. దీనికి ‘ప్రపంచ ఎలెవన్‌ మ్యాచ్‌ కోసం కార్మికులు మైదానాన్ని శుభ్రం చేస్తున్నారు’ క్యాప్షన్‌ ఇచ్చాడు.

కోహ్లీని కార్మికుడితో పోలిస్తే నెటిజన్లు వూరుకుంటారా!.. డెన్నిస్‌కు చురకలంటిస్తూ రీట్వీట్లు పెడుతున్నారు. ఇప్పుడు డెన్నిస్‌-భారత క్రికెట్‌ అభిమానుల మధ్య మాటల యుద్ధమే
నడుస్తోంది. ‘పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టులో ఉన్న మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చెత్తను కోహ్లీ శుభ్రం చేస్తున్నాడు’, ‘భారతీయులు ఎంత మంచి వారో ఈ ఫొటోను చూస్తే తెలుస్తోంది’, ‘కార్మికులు కష్టజీవులు.. దేశం తరఫున ఆడే కోహ్లీ సేనను కార్మికులు అనడంలో తప్పులేదు’ అంటూ వారు బదులిస్తున్నారు.