బ్రిటన్‌లో క్రికెట్‌.. పరమ బోరింగ్‌ గేమ్‌!

దిల్లీ: క్రికెట్‌.. మనదేశంలో ఈ క్రీడకు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. టీమిండియా మ్యాచ్‌ ఉంటే చాలు ఎంతో మంది విద్యార్థులు పాఠశాలలకు, కళాశాలలకు డుమ్మాకొట్టి మైదానంలో వాలిపోతారు. ఉద్యోగస్తులు ఏదో ఒక సాకుతో సెలవు తీసుకుని మ్యాచ్‌ వీక్షించడానికి వచ్చేస్తారు. అంతేకాదు ఎంతోమంది అభిమానులు పలువురు క్రీడాకారులను దేవుళ్లతో సమానంగా కొలుస్తారు. అలాంటి క్రికెట్‌ పరమ బోరింగ్‌ క్రీడ అని తాజా సర్వేలో తేలింది. ఇంతకీ ఈ సర్వే చేసింది మన వారు కాదండోయ్‌.. బ్రిటన్‌ వారు.

బ్రిటన్‌కు చెందిన కొందరు తాజాగా ఓ సర్వే నిర్వహించారు. క్రికెట్‌, టెన్నిస్‌, గోల్ఫ్‌, చెస్‌ ఇలా ఏ క్రీడ పట్ల బోర్‌గా ఫీలవుతున్నారన్న దానిపై సర్వే. ఈ సర్వేలో ఎక్కువ మంది గోల్ఫ్‌కు ఓటేశారు. ఆ తర్వాతి స్థానం క్రికెట్‌దే. ఆ తర్వాతి స్థానాల్లో బ్రిడ్జ్‌, చెస్‌, స్నూకర్‌ ఉన్నాయి. టాప్‌-30లో చోటు దక్కించుకున్న మరికొన్ని క్రీడలు.. ఫుట్‌బాల్‌(10), రగ్బీ(17), టెన్నిస్‌(19), బాక్సింగ్‌(20), బేస్‌బాల్‌(22), ఆర్చరీ(26), జిమ్నాస్టిక్స్‌(28), డైవింగ్‌(30).