బెన్‌స్టోక్స్‌కు మరిన్ని కష్టాలు
వెనక్కి తగ్గుతోన్న స్పాన్సర్లు

లండన్‌: ఇంగ్లాండ్‌ క్రికెటర్‌ బెన్‌ స్టోక్స్‌కు ఇన్నాళ్లు స్పాన్సర్లుగా ఉన్న వారు వెనక్కి తగ్గుతున్నారు. గొప్ప ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్న స్టోక్స్‌ సెప్టెంబరు 26న వెస్టిండీస్‌తో మ్యాచ్‌ అనంతరం బ్రిస్టల్‌లో ఓ నైట్‌ క్లబ్‌లో తప్పతాగి అనంతరం క్లబ్‌ వెలుపల ఇద్దరు వ్యక్తులపై దాడికి పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆగ్రహించిన ఇంగ్లాండ్‌, వేల్స్‌ బోర్డు యాషెస్‌ పర్యటన నుంచి స్టోక్స్‌ను తప్పించింది.

ప్రముఖ క్రీడా సంస్థ న్యూ బ్యాలెన్స్‌ ఇంగ్లాండ్‌ క్రికెట్‌ జట్టుకు కిట్‌ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. తాజాగా స్టోక్స్‌ వివాదంలో చిక్కుకోవడంతో అతనికి స్పాన్సర్‌గా ఉండేందుకు సంస్థ యాజమాన్యం విముఖత వ్యక్తం చేసింది. అతనికి స్పాన్సర్‌గా ఉండలేమని ఇప్పటికే బోర్డు యాజమాన్యానికి తెలిపింది. ప్రస్తుతం స్టోక్స్‌ పోలీసుల విచారణకు హాజరవుతున్నాడు. అక్టోబరు 28న ఇంగ్లిష్‌ జట్టు ఆసీస్‌లో అడుగుపెట్టనుంది.

ప్రియురాలను పెళ్లాడనున్న స్టోక్స్‌
స్టోక్స్‌ ఈ శనివారం తన ప్రియురాలు క్లారీ రాక్లిఫ్‌ను పెళ్లాడనున్నారు. సుమారు 400మంది సన్నిహితులు, స్నేహితుల మధ్య చర్చిలో వివాహం చేసుకోనున్నారు. ఈ ఇద్దరూ గత ఏడేళ్లుగా ప్రేమలో ఉన్నారు.
ఐపీఎల్‌-10లో భాగంగా క్రీడాకారుల కోసం నిర్వహించిన వేలంలో స్టోక్స్‌ను రికార్డు స్థాయిలో రూ.14.5 కోట్లు వెచ్చించి రైజింగ్‌ పుణె సూపర్‌జెయింట్‌ దక్కించుకున్న సంగతి తెలిసిందే. 12 మ్యాచులు ఆడిన అతడు 316 పరుగులు చేసి 12 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.