కుర్రాళ్లు హుషారుగా..
ఘనాతోభారత్‌ పోరు నేడు

ఏమాత్రం అనుభవం లేదు. ఎలాంటి అంచనాలు లేవు. ప్రపంచకప్‌కు పూర్తిగా కొత్త. టోర్నీకే పసికూన. ఐతేనేమీ తొలి మ్యాచ్‌లో భారత్‌ కాస్త గౌరవప్రదమైన ప్రదర్శనే చేసింది. రెండో మ్యాచ్‌లో అద్భుత పోరాటంతో ఆకట్టుకుంది. ఓ గోల్‌ కూడా కొట్టింది. ఈ టోర్నీలో ఆడేందుకు తమకు అర్హత ఉందని చాటుకుంది. ఓడిపోయినా శభాష్‌ అనిపించుకుంది. అందుకే రెట్టించిన ఉత్సాహంతో, ఆత్మవిశ్వాసంతో గ్రూపులో ఆఖరి సమరానికి సన్నద్దమైంది.

మాజీ ఛాంపియన్‌తో ఘనాతో మ్యాచ్‌ నేడే. మరి తన ప్రదర్శనను మెరుగుపర్చుకుంటూ ఆకట్టుకుంటున్న కుర్రాళ్లు.. ఈ మూడో మ్యాచ్‌లో మరింత మెరుస్తారా ? మరింత అలరిస్తారా?

దిల్లీ
ఈ గ్రూప్‌-ఏ సమరంలో ఘనా తిరుగులేని ఫేవరెట్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఐతే మొదటి మ్యాచ్‌కు ఈ మ్యాచ్‌కు ఒక్కటే తేడా. ఈసారి భారత జట్టు కాస్త అంచనాతో, కాస్త ఆశతో బరిలోకి దిగుతోంది. అలాగని అద్భుతాలు చేస్తుందని కాదు, సంచలనాలు సృష్టిస్తుందనీ కాదు. కానీ తొలి రెండు మ్యాచ్‌ల్లో ప్రదర్శనతో ప్రపంచంలో అత్యుత్తమ జట్లతో తాము పోటీపడగలమని నిరూపించుకున్న భారత జట్టుపై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఆతిథ్య జట్టు మరోసారి స్ఫూర్తిదాయక ప్రదర్శన చేయాలన్నది

వారి కోరిక.
కొలంబియాపై కోచ్‌ డి మాటోస్‌ రక్షణాత్మక గేమ్‌ప్లాన్‌ను భారత కుర్రాళ్లు మెరుగ్గా అమలు చేశారు. కాస్త అదృష్టం తోడైతే భారత్‌ గెలిచేదే. మ్యాచ్‌లో చాలా వరకు కొలంబియాదే ఆధిపత్యం. కానీ తొలి అర్ధభాగంలో అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉంటే ఫలితం భిన్నంగా ఉండేదన్నది కోచ్‌ అభిప్రాయం. అంచనాలు పెరగడంతో కొలంబియాపై ప్రదర్శన గాలివాటం కాదని నిరూపించుకోవాలనే పట్టుదలతో భారత జట్టు ఉంది. ఐతే ఘనాతో పోరు చాలా కఠినమైందే. ఈ టోర్నీలోనే శారీరకంగా అత్యంత బలంగా ఉన్న జట్టు అది. జవహర్‌లాల్‌ నెహ్రూ

స్టేడియంలో జరిగే ఈ పోరులో ఘనా స్పష్టమైన ఫేవరెట్‌.
చాలా పటిష్టంగా ఉన్న ఆ జట్టుపై భారత్‌ విజయాన్ని వూహించలేం. ఒకవేళ గెలుస్తుందనుకున్నా నాకౌట్‌ చేరడం దాదాపుగా అసాధ్యం. గ్రూపు నుంచి తొలి రెండు జట్లకు నేరుగా రౌండ్‌-16 చేరే అవకాశముండగా.. అమెరికా ఇప్పటికే ముందంజ వేసింది. కొలంబియా, ఘనా చెరో రెండు పాయింట్లతో ఉన్నాయి. రెండు మ్యాచ్‌ల్లో ఓటమితో ఇప్పటివరకు ఖాతాలో ఒక్క పాయింటు కూడా లేని భారత్‌.. ఐదు గోల్స్‌ ఇచ్చింది. ఒక గోల్‌ కొట్టింది. జట్లు పాయింట్ల పరంగా సమమైతే ‘గోల్‌ వ్యత్యాసం’ ఆధారంగా గ్రూప్‌ ర్యాకింగ్స్‌ను నిర్ణయిస్తారు. భారత్‌ ప్రస్తుతం మైనస్‌ 4 గోల్‌ వ్యత్యాసంతో గ్రూపులో అట్టడుగున ఉంది. కాబట్టి నాకౌట్‌ రేసులో నిలవాలంటే భారీ విజయం సాధించాలి.

ప్రిక్వార్టర్స్‌లో ఫ్రాన్స్‌
ఫ్రాన్స్‌ జట్టు అండర్‌-17 ప్రపంచకప్‌ ప్రిక్వార్టర్‌ఫైనల్లో అడుగుపెట్టింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 2-1తో జపాన్‌పై విజయం సాధించింది. గవిరి 13వ, 71వ నిమిషాల్లో గోల్స్‌తో ఫ్రాన్స్‌ను నాకౌట్‌ చేర్చాడు. జపాన్‌ తరఫున నమోదైన ఏకైక గోల్‌ను తైసీ మియాషిరో (73వ) సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఓడినా జపాన్‌ గ్రూప్‌-ఇ నుంచి ప్రిక్వార్టర్స్‌ రేసులో ఉంది. తన తొలి మ్యాచ్‌లో ఆ జట్టు 6-1తో హోండురస్‌పై గెలిచింది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన ఫ్రాన్స్‌ గ్రూపు-ఇలో అగ్రస్థానంలో ఉంది. మరో మ్యాచ్‌లో హోండురస్‌ 5-0తో న్యూకలెడోనియాను చిత్తు చేసింది. గ్రూప్‌-ఎఫ్‌లో ఇంగ్లాండ్‌ 3-2తో మెక్సికోపై నెగ్గి ప్రిక్వార్టర్స్‌లో ప్రవేశించింది. మరో మ్యాచ్‌లో ఇరాక్‌ 4-0తో చిలీని చిత్తు చేసింది.