ఉద్యోగులకు డీఏ పెంపు
గ్రాట్యుటీ పరిమితి రూ.20 లక్షలకు పెంపుదల
కేంద్ర మంత్రివర్గ నిర్ణయాలు

పాలశుద్ధి, మౌలిక వసతుల నిధి కింద పదేళ్ల కాలానికి రూ.10,881 కోట్ల నిధి ఏర్పాటు చేస్తూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకొంది. 2017-18 నుంచి 2028-2029 వరకు ఇది అమల్లో ఉంటుంది. గత బడ్జెట్‌లో ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. భారత్‌ ప్రపంచంలో 19% పాలను ఉత్పత్తి చేస్తోంది. ప్రజలకు 30-35% పోషకాలు పాలనుంచే అందుతున్నాయి. అందువల్ల పాల ఉత్పత్తిని పెంచే లక్ష్యంతో ఈ నిధి ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా 50 వేల గ్రామాల్లో ఉన్న 95 లక్షలమంది రైతులకు దీనివల్ల ప్రయోజనం చేకూరుతుంది. ఇప్పుడున్న దానికంటే అదనంగా రోజుకు 126 లక్షల లీటర్ల పాలశుద్ధి సామర్థ్యాన్ని పెంచుతారు. 28 వేల బల్క్‌ మిల్క్‌ కూలర్లు ఏర్పాటు చేస్తారు. రోజూ 59.78 లక్షల లీటర్లకు సమానమైన విలువ ఆధారిత వస్తువులు ఉత్పత్తి చేస్తారు. తొలుత 12 రాష్ట్రాల్లో లాభాలు ఆర్జిస్తున్న 39 పాల యూనిట్లలో ఈ పనులు ప్రారంభించి, దశల వారీగా మిగిలిన సహకార సంఘాలకూ విస్తరింపజేస్తారు. దీనివల్ల 40 వేలమందికి ప్రత్యక్షంగా, 2 లక్షల మందికి పరోక్ష ఉపాధి లభిస్తుంది.

* పేమెంట్‌ ఆఫ్‌ గ్రాట్యుటీ బిల్లు-2017కు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. దీనివల్ల ప్రభుత్వరంగసంస్థలు, ప్రైవేటురంగంలో పనిచేసే ఉద్యోగులకు పన్నురహిత గ్రాట్యుటీ గరిష్ఠ పరిమితి రూ.20లక్షలకు పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 7వ వేతన సవరణ సంఘం గ్రాట్యుటీని రూ.10 లక్షలనుంచి రూ.20లక్షలకు పెంచిన నేపథ్యంలో దాన్ని ప్రైవేటు ఉద్యోగులకూ వర్తింపజేయనున్నారు. అలాగే భవిష్యత్తులో ఈ చట్టంలో సమయానుకూలంగా మార్పులు, చేర్పులు చేసే అధికారాన్ని ప్రభుత్వానికి కట్టబెడుతూ మంత్రివర్గం తీర్మానించింది.
* కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 1% అదనపు డీఏ ఇవ్వడానికి మంత్రివర్గం ఆమోదించింది. 49.26 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 61.17 లక్షల మంది పింఛనుదారులకు ప్రయోజనం కలుగుతుంది. జులై 1 నుంచి అమల్లోకి వచ్చే ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వంపై ఏటా రూ.3,068.26 కోట్ల అదనపు భారం పడుతుంది.
* దేశంలో చమురు క్షేత్రాలను విస్తరింపజేయడానికి వీలుగా 48,243 లైన్‌ కిలోమీటర్ల సీస్మిక్‌ డేటాను సేకరించాలని నిర్ణయించారు. ఈ సర్వేకు రూ.2,932.99 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ప్రభుత్వరంగ సంస్థలైన ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌, ఓఎన్‌జీసీలు దేశంలోని 24 రాష్ట్రాల్లో ఈ సర్వే చేపడతాయి. దీనివల్ల 11 వేల మందికి ఉపాధి లభిస్తుంది.
* ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్‌ వ్యాపారంలో అడుగుపెట్టడానికి వీలుగా ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసుకోవడానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. దీనివల్ల బీఎస్‌ఎన్‌ఎల్‌ కొత్త కంపెనీ ఏర్పాటు చేసుకొని టవర్ల వ్యాపారం చేయడానికి వీలుపడుతుంది. దేశవ్యాప్తంగా 4.42 లక్షల టవర్లు ఉంటే అందులో 66 వేలు బీఎస్‌ఎన్‌ఎల్‌వి ఉన్నాయి. ఇప్పుడు ప్రత్యేక కంపెనీ ఏర్పాటు చేసుకోవడం వల్ల బయట అద్దెకు తీసుకొని నిర్వహించే సామర్థ్యం పెరుగుతుంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులు ఇందులోకి డిప్యుటేషన్‌పై వెళ్తారు. రెండేళ్లలో మొత్తం కార్యక్రమం పూర్తవుతుంది. ఇదేమీ బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రైవేటీకరణ కాదని ఆ శాఖ మంత్రి మనోజ్‌సిన్హా ప్రకటించారు. టవర్‌ బిజినెస్‌ ఆదాయం తెస్తుందన్న ఉద్దేశంతోనే ఆ రంగంలోకి వెళ్తున్నట్లు చెప్పారు.
* లఖ్‌నవూ-బారాబంకి, ఫైజాబాద్‌-జౌన్‌పూర్‌-వారణాసి మధ్య 330కి.మీ. రైల్వేను డబ్లింగ్‌గా మారుస్తారు. ఇందుకోసం రూ.1310కోట్లుఖర్చు చేస్తారు.
* దౌండ్‌-మన్మాడ్‌ మధ్య 247.5 కి.మీ. రైలు మార్గాన్ని రూ.2,810 కోట్లతో డబ్లింగ్‌ చేస్తారు. దీనివల్ల ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన షిర్డీ, శనిశింగనాపూర్‌కు ప్రయాణం సులభం అవుతుంది. రైతులు వ్యవసాయ ఉత్పత్తులను దూరప్రాంతాలకు రవాణా చేసుకోవడానికి వీలవుతుంది. నాలుగున్నరేళ్లలో ఈ పని పూర్తి చేస్తారు.