దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి విజయాల్లో విజయేంద్ర ప్రసాద్‌ వాటా కూడా ఉంది. ఎందుకంటే రాజమౌళి చిత్రాలకు కథ అందించి, తెర వెనుక విజయ సారథిగా నిలిచింది ఆయనే. ‘భజరంగీ భాయ్‌జాన్‌’తో బాలీవుడ్‌లోనూ ఆయన పేరు మార్మోగిపోయింది. ఇప్పుడు ‘శ్రీవల్లీ’ చిత్రాన్ని తన దర్శకత్వంలోనే తెరకెక్కించారు. ఈ చిత్రం ఈనెల 15న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా మంగళవారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు.

‘శ్రీవల్లీ’ ఆలోచన ఎలా పుట్టింది?
వాల్మీకి రాసిన ‘రామాయణం’ ఎలా విషాదం నుంచి పుట్టిందో, అలానే ‘శ్రీవల్లీ’ కూడా విషాదంలోంచే వచ్చింది. నా ప్రాణమిత్రుడైన రమేష్‌ విజయవాడలో ఉండేవాడు. ఓ సారి వినాయకచవితి రోజు తెగ గుర్తొచ్చాడు.ఆ తర్వాత వాణ్ణి కలుద్దామని విజయవాడ వెళితే చనిపోయాడని తెలిసింది. నాకు గుర్తొచ్చిన వినాయకచవితి రోజునే రమేష్‌ కూడా నా గురించి పదే పదే తలచుకొన్నాడట. ఈ సంగతి తన డైరీలోనూ రాసుకొన్నాడట. మేమిద్దరం ఒకరి గురించి ఒకరం ఒకే సమయంలో ఆలోచించాం. ఇదెలా సాధ్యం? శబ్ద తరంగాల్లా మనిషిలోని ఆలోచనా తరంగాలు ఒకరి నుంచి మరొకరికి చేరతాయా? అనిపించింది. అందులోంచి పుట్టిన కథే ఇది. మనిషి మనసుని చదవగలిగితే దుర్మార్గులను సైతం సన్మార్గులుగా మార్చవచ్చు కదా! ఈ అంశానికి పునర్జన్మల కథని మిళితం చేసి వాణిజ్యాంశాలతోకూడిన సైంటిఫిక్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కించాను.

మీరే ఎందుకు దర్శకత్వం వహించారు?
ఇది నా కథ. నాలో పుట్టింది. నేనైతేనే అనుకొన్నది అనుకొన్నట్టు తెరకెక్కిస్తాననిపించింది.

ఈ సినిమా ఆలస్యానికి కారణం?
కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ వల్లే ఆలస్యమైంది. థ్రిల్లర్‌ కథ చేయడమంటే నాకిష్టం. ఈతరం ప్రేక్షకులూ వీటిని బాగా ఇష్టపడుతున్నారు. కొంతమంది రచయితలకు, దర్శకులకు చూపించా. ‘ఈ మలుపుల్ని వూహించలేదు’ అన్నారు. రాజమౌళి ఇంకా ఈ సినిమా చూడలేదు. కథ మాత్రం తెలుసు.

బాలీవుడ్‌ చిత్రం ‘మణికర్ణిక’ ఎంత వరకూ వచ్చింది?
ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత కథ ఇది. ఈ కథ రాయమన్నప్పుడు ‘క్రిష్‌ దర్శకుడు అయితేనే కథ రాస్తా’ అన్నాను. అప్పటికే ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ విడుదలైంది కాబట్టి నిర్మాతలు ఆనందంగా అంగీకరించారు. చరిత్రను ఎక్కడా వక్రీకరించలేదు. ఇలాంటి చారిత్రక చిత్రాలను ప్రజల్లో చైతన్యం కలిగేలా తెరకెక్కించాలి. మేం అదే పని చేస్తున్నాం. ఝాన్సీగా కంగనా రనౌత్‌ నటిస్తోంది. యాక్షన్‌ ఘట్టాలకు ప్రాధాన్యం ఉంది. వాటికే ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తోంది.

తమిళ చిత్రం ‘మెర్శెల్‌’ ఎంత వరకూ వచ్చింది?
ఇందులో విజయ్‌ కథానాయకుడు. అట్లీ దర్శకుడు. చాలా మటుకు పూర్తయింది. దీనికి స్క్రీన్‌ప్లే అందించాను. ఈ చిత్రానికి పని చేస్తుండగానే ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్‌. రెహమాన్‌ కూడా తను తీయనున్న చిత్రానికి స్క్రీన్‌ప్లేను అందించమని కోరారు. ఇది మహదావకాశమే. కానీ నేనే ఇంకా ఏ మాటా చెప్పలేదు. చూద్దాం.

మీ దర్శకత్వంలో రాబోయే చిత్రాలేంటి?
రెండు సినిమాలకు సన్నాహాలు జరుగుతున్నాయి. అందులో ఓ చిత్రాన్ని బాలీవుడ్‌లో తీస్తా. ఈ చిత్రాల వివరాలు విజయదశమికి ప్రకటిస్తా.

‘మగధీర-2’ రాజమౌళి దర్శకత్వంలో రానుందా?
చిరంజీవి, రామ్‌చరణ్‌ల కోసం ఆ స్థాయిలో ఓ కథ రాయాలని ఉంది. రాజమౌళి వెసులు బాటును బట్టి ఎప్పుడైనా ఆచరణలోకి రావచ్చు.

రాజమౌళి ‘మహాభారతం’ తీస్తానన్నారు…
అదెప్పుడనేది నేనూ చెప్పలేను. కానీ తను మాత్రం మహాభారతం చిత్రాన్ని తప్పకుండా తీస్తాడు. రాజమౌళికి యుద్ధాలంటే బాగా ఇష్టం. వాటి కోసమైనా ‘మహాభారతం’ తీస్తాడు.