ఇంటర్నెట్‌డెస్క్‌: బంతి… పండు… కపిల్‌… కర్రి… బూస్ట్‌… గన్‌ ది జగన్‌…

ఈ పేర్లు వింటుంటే మీకు ఏం గుర్తొస్తుంది. సినిమాలంటే ఆసక్తి ఉన్నవాళ్లకు కచ్చితంగా సునీల్‌ గుర్తుకొస్తాడు. తనదైన కామెడీతో సినిమాల్లో, ప్రేక్షకుల్లో చెరగని ముద్రవేసిన సునీల్‌… ఆ తర్వాత కథానాయకుడిగా అలరించడం ప్రారంభించాడు. హీరోగా సునీల్‌ను చూస్తున్నా… ఎక్కడో ఆయన కామెడీని మిస్‌ అయ్యామనే బాధ మాత్రం తెలుగు ప్రేక్షకుల్లో ఉండిపోయింది. దాన్ని తీర్చేయడానికి సునీల్‌ సిద్ధమయ్యాడు. త్వరలో కమేడియన్‌గా రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు.

‘‘హాస్యనటుడిగా వరుస సినిమాలు చేస్తున్నప్పుడే హీరో అవకాశం వచ్చింది. దాన్ని వదులుకోవడం ఇష్టం లేక హాస్యనటుడి పాత్రలకు దూరంగా వెళ్లాను. అయితే పాత స్థాయిలో నవ్వులు పండించాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. త్వరలో కమేడియన్‌గా సినిమాలు మొదలుపెడతాను. అయితే హీరో పాత్రలు విడిచి పెట్టను. సంవత్సరంలో హీరోగా రెండు సినిమాలు చేసుకుంటూ మిగిలిన సమయాల్లో హాస్యనటుడిగా అలరిస్తాను’’ అని చెప్పాడు సునీల్‌. అయితే ఇక మళ్లీ నాటి ‘బంతి’ని చూడొచ్చన్నమాట. అన్నట్లు ఈ మధ్య సునీల్‌ కాస్త లావెక్కి పాత సునీల్‌ని గుర్తుకుతెస్తున్నాడు. దాని అసలు కారణం ఇదేనేమో.