Rendu-rellu-aaru

నటీనటులు: అనిల్‌ మల్లెల, మహిమ, నరేష్‌, రవి కాలే, తాగుబోతు రమేష్‌, రమేష్‌, రాఘవ, ఐశ్వర్య, మనోహర్‌ తదితరులు.
సంగీతం: విజయ్‌ బుల్గానిన్‌
ఛాయాగ్రహణం: వేంకట అమరనాథ్‌ రెడ్డి
కూర్పు: జానకీరామ్‌
నిర్మాతలు: ప్రదీప్‌ చంద్ర, మోహన్‌ అందె
రచన – దర్శకత్వం: నందు మల్లెల
సంస్థ: వారాహి చలన చిత్రం
విడుదల: 8 జులై 2017

‘పెళ్లి చూపులు’ విజయం తరవాత చిన్న సినిమాలపై ‘చిన్న’ చూపు బాగా తగ్గింది. ఎప్పుడు ఏ చిన్న సినిమా వూహించని విజయం సాధిస్తుందో… ఎవ్వరూ చెప్పలేరన్న విషయం ఆ సినిమాతో మరోసారి రూఢీ అయ్యింది. అయితే… ‘పెళ్లి చూపులు’ తరవాత ఆ స్థాయిలో చిన్న సినిమా మెరవలేదు. అప్పుడప్పుడూ కొన్ని ప్రయత్నాలు జరిగినా, పూర్తి స్థాయిలో విజయవంతం కాలేదు. ఇప్పుడు మరో సినిమా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వచ్చింది. అదే.. ‘రెండు రెళ్ళు ఆరు’. జంధ్యాల‌ టైటిల్‌, సాయి కొర్రపాటి నిర్మాణ సారథ్యంతో ‘రెండు రెళ్లు ఆరు’పై కాస్త ఆసక్తి కలిగింది. మరి.. ఆ ఆసక్తిని ఈ సినిమా ఎంత వరకూ నిలుపుకొంది? జంధ్యాల‌ టైటిల్‌కి ఎంత వరకూ న్యాయం చేసింది?

కథేంటంటే…?
రాజు (నరేష్‌), రావు (రవి కాలే) మధ్యతరగతి తండ్రులు. ఇద్దరి భార్యలూ ఒకేసారి ఒకే ఆసుపత్రిలో కాన్పు కోసం వస్తారు. రాజుకి మగబిడ్డ (మాధవ్‌) రావుకి ఆడబిడ్డ (మేఘన) పుడతారు. అయితే.. పుట్టిన పిల్లలకు విచిత్రమైన జబ్బు ఉందని, 22 యేళ్లే ఆయుష్షని చెబుతారు డాక్టర్లు. రాజుకి పుట్టిన మగబిడ్డకి ఈ జబ్బు ఉందని రావుకి… రావుకి పుట్టిన అమ్మాయికి ఈ జబ్బు ఉందని రాజుకి తెలీదు. ‘మా ఆవిడకు అమ్మాయిలంటే ఇష్టం. కానీ అబ్బాయి పుట్టాడు.. మీ ఆవిడకు అబ్బాయి అంటే ఇష్టం అమ్మాయి పుట్టింది. కాబట్టి.. మనం మన పిల్లల్ని మార్చేసుకొందాం’ అనే ప్రతిపాదనకు వస్తారు ఇద్దరూ. అలా.. మాధవ్‌, మేఘనలను పరస్పరం మార్చుకొంటారు. తమ బిడ్డల్ని కళ్ల ముందే చూసుకోవాలని… ఎదురెదురు ఇళ్లలోనే కాపురం పెడతారు. మాధవ్‌, మేఘనలు తిట్టుకొంటూ కొట్టుకొంటూ పెరుగుతారు. అయితే అనుకోకుండా వాళ్ల మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఆ ప్రేమని తుంచేయాలని రాజు, రావులు ప్రయత్నిస్తారు. మరి వాళ్ల ప్రయత్నం ఫలించిందా? పిల్లల ప్రేమ గెలిచిందా? అనేదే ‘రెండు రెళ్లు ఆరు’ కథ.

తెరపై ఎలా సాగిందంటే..?
చాలా క్లిష్టమైన కథ ఇది. పిల్లల్ని మార్చుకొన్న తండ్రుల ఆవేదన, ఎదురుగా తన బిడ్డ ఉన్నా… ‘నాన్న’ అని పిలిపించుకోలేని పరిస్థితులు. కొడుకే.. తన ఇంటికి అల్లుడిగా రావడం, కూతురు కోడలిగా మారడం ఇవన్నీ కొత్తగా ఉంటాయి. దర్శకుడు ఎంచుకొన్న కథ కొత్తది. అయితే ఎలాంటి గందగోళం లేకుండా తెరకెక్కించగలిగాడు. 22 ఏళ్లు దాటితే చనిపోతారన్న విషయం ముందే చెప్పేశాడు దర్శకుడు. దాంతో ఈ సినిమా కాస్త డ్రమెటిక్‌గా, భారంగా సాగుతుందేమో అనిపిస్తుంది. అయితే ఆ భావన రాకుండా సరదా సన్నివేశాలతో సినిమాని నడిపించేశాడు. ఇద్దరు తండ్రుల పాత్రలు ఈ కథకు కీలకం. వాళ్ల భావోద్వేగాల్ని చూపిస్తూనే, నాయికా నాయకల మధ్య చిలిపి తగాదాలు, ప్రేమ.. ఇవన్నీ అందంగా తీసుకొచ్చాడు. సీరియల్‌ హీరోపై సాగిన కామెడీ ట్రాక్‌ బాగుంది. తాగుబోతు రమేష్‌తో తెరకెక్కించిన సన్నివేశాలూ పండాయి. పాటలు కథలో భాగంగానే వస్తాయి. డ్యూయెట్లు పెట్టి సమయం వృథా చేయలేదు దర్శకుడు. ద్వితీయార్థంలో కాస్త అక్కడక్కడ కథకు బ్రేకులు పడినట్టు అనిపించినా, పతాక దృశ్యాలు మళ్లీ ఎమోషనల్‌గా సాగుతాయి. ఈ కథని విషాదాంతంగా ముగించే ఛాన్స్‌ ఉంది. కానీ.. మనకు ఆ తరహా కథలు పెద్దగా రుచించవు. అందుకే దర్శకుడు ఆ సాహహం చేయలేదేమో అనిపిస్తుంది.
ఎవరెలా నటించారంటే..?

నాయకా నాయికలు ఇద్దరూ కొత్తవారే. మహిమ చూడగా చూడగా నచ్చేస్తుంది. చాలా సహజంగా కనిపించింది.. నటించింది. అనిల్‌ మాత్రం తడబడ్డాడు. తన స్థానంలో మరో కథానాయకుడు ఉంటే బాగుండేది అనిపిస్తే.. అది ప్రేక్షకుడి తప్పు కాదు. ఈ కథని కొత్తవాళ్లతోనే చెప్పాలని దర్శక నిర్మాతలు భావించి ఉంటారేమో. నరేష్‌ ఎప్పటిలా ఆకట్టుకొన్నారు. రవి కాలేకి ఈ తరహా పాత్ర దక్కడం ఇదే తొలిసారి. తన సహజసిద్ధమైన నటనతో ఆ పాత్రకు వన్నె తీసుకొచ్చాడు. తాగుబోతు రమేష్‌ పాత్రని ఇలా తూలకుండా చూడడం ఇదే తొలిసారి.
సాంకేతికంగా చూస్తే.. ఇది దర్శకుడి సినిమా. ఇలాంటి పాయింట్‌ని కథగా చెప్పడం చాలా కష్టం. అయితే ఆ కష్టాన్ని ఇష్టంగా దాటేశాడేమో అనిపించింది. వినోదానికి ఢోకా లేకుండా చూసుకొన్నాడు. చివర్లో తాను అనుకొన్న పాయింట్‌ బలంగా చెప్పాడు. తొలి సినిమా అయినా.. క‌న్విన్సింగ్‌గా తీయగలిగాడంటే దర్శకుడిలో విషయం ఉన్నట్టే. అక్కడక్కడా డైలాగులు బాగా వినిపించాయి. పాటలు కథలో భాగంగా వచ్చాయి. అందులోని సాహిత్యం కూడా ఆకట్టుకొంది. గోదావరి, చెరువులు, చెట్లు, మధ్యలో ఇల్లు… ఈ ప్రకృతి రమణీయత చూస్తే.. పల్లెటూరిపై ప్రేమ పొంగుకొస్తుంది.