మరి కొద్ది రోజులలో విడుదల కాబోతున్న ‘జై లవ కుశ’ రిజల్ట్ గురించి ఆశక్తిగా ఎదురుచూస్తున్న జూనియర్ ఈసినిమాను చాల భారీగా ప్రమోట్ చేయడానికి చాల ఆలోచనలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అన్ని ప్రముఖ ఛానల్స్ కు ఇంటర్వ్యూలతో పాటు ప్రింట్ మీడియాను కూడ ‘జై లవ కుశ’ ప్రమోషన్ కు వాడుకుంటూ తాను హోస్ట్ చేస్తున్న ‘బిగ్ బాస్’ షో ద్వారా ఈమూవీ ప్రమోషన్ ను చాల విభిన్నంగా జనం మధ్యకు తీసుకు వెళ్ళడానికి జూనియర్ పెద్ద హోమ్ వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉండగా ఈసినిమా విడుదలైన తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో జూనియర్ నటించబోతున్న మూవీ కథ ఫైనల్ కావడంతో ఆ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ తో పాటు ఆమూవీలో జూనియర్ లుక్ గురించి కూడ జూనియర్ త్రివిక్రమ్ ల మధ్య కొన్ని ప్రాధమిక చర్చలు జరిగినట్లు సమాచారం. జూనియర్ తో త్రివిక్రమ్ తీయబోతున్న సినిమా యాక్షన్ రొమాంటిక్ డ్రామా కావడంతో ఈమూవీలో జూనియర్ ను బాగా స్లిమ్ గా చూపెట్టాలని త్రివిక్రమ్ అభిప్రాయపడుతున్నట్లు టాక్.

దీనితో ‘జై లవ కుశ’ హడావిడి అయిన తరువాత ఒక ట్రైనర్ ను పెట్టుకుని డైటింగ్ చేస్తూ బాగా సన్నబడమని త్రివిక్రమ్ జూనియర్ కు సలహా ఇచ్చినట్లు టాక్. ‘జై లవ కుశ’ మూవీలో మళ్ళీ జూనియర్ బొద్దుగా కనిపించాడు అని వార్తలు వస్తున్న నేపధ్యంలో ముందు జాగ్రత్తతో త్రివిక్రమ్ ఈ సలహాను ఇచ్చినట్లు తెలుస్తోంది.

జూనియర్ భోజన ప్రియుడు కావడంతో తనకు నచ్చిన ఏ ఐటమ్ ను అయినా బాగా తింటాడు అని కామెంట్స్ ఉన్న నేపధ్యంలో త్రివిక్రమ్ సలహాతో జూనియర్ కొన్నాళ్ళపాటు తన నోరును కట్టి పెట్టుకోవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి అని అంటున్నారు. అయితే ఎప్పటి నుంచో త్రివిక్రమ్ తో మూవీ చేయడం జూనియర్ కల కాబట్టి ఆ కల కోసం జూనియర్ త్రివిక్రమ్ టాస్క్ ను విధిగా అమలు పరిచే పరిస్థుతులు ఏర్పడ్డాయి అని అంటున్నారు..