‘నేనే రాజు నేనే మంత్రి’ ట్రైలర్‌

హైదరాబాద్‌: దగ్గుబాటి రానా కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి’. తేజ దర్శకుడు. ఈ చిత్ర ట్రైలర్‌ ఈరోజు విడుదలైంది. రానా ట్రైలర్‌ను ట్విటర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

ట్రైలర్‌లో రానా, కాజల్‌ మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది. రానా.. కాజల్‌ వైపు చూస్తున్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో ‘నెలవంక తొంగి చూసింది..’ అంటూ అలనాటి నటుడు ఎన్టీరామారావు నటించిన రాజకోటరహస్యంలోని పాట, అషుతోష్‌ రానా ‘నీ కటౌట్‌కి గజమాలపడే టైం వచ్చేసింది’ అని చెప్తున్న డైలాగ్‌ హైలైట్‌గా నిలిచాయి.

ఈ చిత్రంలో రానాకి జోడీగా కాజల్‌ అగర్వాల్‌, కేథరీన్‌ నటిస్తున్నారు. ఇందులో పోసాని కృష్ణమురళి, జయప్రకాశ్‌రెడ్డి కీలకపాత్రలో నటించారు. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం సమకూరుస్తున్నారు. సురేశ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని సురేశ్‌బాబు నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.