ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శ్రీవల్లీ.’ ఈ మూవీ శుక్రవారం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ, మన మనసు నుంచి వచ్చే భావ తరంగాలను చూడగలిగితే, వాటిని అదుపు చేయగలిగితే ఎన్నో మంచి పనులు చేయొచ్చని అశోక్ మల్హోత్రా అనే సైంటిస్ట్ చేసే ప్రయోగం పేరే ‘శ్రీవల్లీ’ అని చెప్పారు.

ఈ ప్రయోగాన్ని తనపై చేయమంటూ ఆ సైంటిస్ట్ కూతురు ముందుకొస్తుందని, ఆమె పేరు ‘శ్రీవల్లీ’ అని …ఈ ప్రయోగం వల్ల ఆమెకు గతజన్మ స్మృతులు మొదలవుతాయని, గత జన్మలో తన పేరు లైలా అని తెలుసుకుంటుందని అన్నారు. సైంటిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కించిన ఈ చిత్రం ట్రయాంగిల్ ప్రేమకథతో నడుస్తుందని చెప్పారు. ఇదిలా ఉండగా, హిందీలో వచ్చిన ‘నాయక్’కు సీక్వెల్ రాస్తున్నానని వెల్ల‌డించాడు.

అలాగే చిరంజీవి, రామ్ చరణ్ కాంబనేషన్ కోసం‘మగధీర-2’ కథ రాయాలని ఉందని త‌న మ‌న‌సులోని మాటను తెలిపారు. ఆ క‌థ రాసే అవకాశం తనకే రావాలనీ, ఆ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించాలని కోరుకుంటున్నానని అన్నాడు. అయితే ఇది ఎంత‌వ‌ర‌కూ సాధ్యం అవుతుందో తాను చెప్ప‌లేనంటూ మీడియా స‌మావేశాన్ని ముగించారు.