ప్రముఖ కార్టూనిస్ట్ మోహన్ గత కొన్ని రోజులుగా తీవ్ర అస్వస్థతతో ఉన్న విషయం తెలిసిందే. కాగా నేటి తెల్లవారుజామున హైదరాబాద్ లోని బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. గత కొంతకాలంగా ఊపిరితిత్తులు, మూత్రపిండాల సమస్యతో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే కేర్‌ ఆస్పత్రికి తరలించారు.

పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో వెంటిలేటర్‌పై ఉంచి వైద్యుల బృందం చికిత్స అందించారు. ఆయన శరీరం వైద్యానికి సరిగ్గా సహకరించడం లేదని, ఆరోగ్య పరిస్థితి విషమంగా మారి నేడు తెల్లవారుజామున మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆంధ్రప్రభ, ఉదయం, సాక్షి దినపత్రికల్లో కార్టూనిస్ట్ గా సేవలు అందించారు. రాజకీయ కార్టూన్లు వేయడంలో మోహన్ దిట్ట.

సామాజికంగా కోణంలో కార్టూన్లు వేసేవారు మోహన్. పొలిటికల్‌ కార్టూనిస్టుగా మోహన్‌ దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందారు. కమ్యూనిస్టు కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన మొహన్‌ అదే సిద్ధాంతానికి అంకితమై వృత్తిని కొనసాగించారు. 1951 డిసెంబర్ 24న ఏలూరు లో జన్మించిన ఆయన.. 1970లో విశాలాంధ్ర లో సబ్ ఎడిటర్ గా జర్నలిస్ట్ జీవితం ప్రారంభించారు.

మోహన్ మృతి పట్ల పలువురు సీనియర్ పాత్రికేయులు ,రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు. ఉదయం 10గంటలకు సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌కు మోహన్‌ మృతదేహాన్ని తరలించనున్నారు.