‘ఘట్టమేదైనా.. పాత్రేదైనా.. నేను రె.. రె.. రెడీ’ అంటూ ‘జైలవకుశ’ ట్రైలర్‌లో అదరగొట్టారు ఎన్టీఆర్‌. ఆదివారం విడుదలైన చిత్ర ట్రైలర్‌ రికార్డు సృష్టించింది. విడుదలైన 24 గంటల్లో 7.54 మిలియన్ల డిజిటల్‌ వ్యూస్‌ను సాధించింది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇంత వేగంగా అన్ని వ్యూస్‌ దక్కించుకున్న రెండో చిత్ర ట్రైలర్‌ ఇదేనట. ఈ వరుసలో ‘బాహుబలి’ ట్రైలర్‌ మొదటి స్థానంలో ఉన్నట్లు మూవీ ట్రాకర్‌ రమేశ్‌ బాలా ట్వీట్‌ చేశారు. దీని తర్వాతి స్థానంలో ‘జై లవకుశ’ ట్రైలర్‌ నిలిచిందన్నారు.

ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ ధన్యవాదాలు చెప్పారు. ‘‘జై లవకుశ’ ట్రైలర్‌కు వచ్చిన స్పందన చాలా సంతోషాన్ని ఇచ్చింది. అందరికీ ధన్యవాదాలు. గతంలో చెప్పినట్లుగానే.. నా నటనతో మీ అందరూ (అభిమానులు) తృప్తి చెందే విధంగా కష్టపడతా’ అని అన్నారు.

బాబీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై కల్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్నారు. రాశీఖన్నా, నివేదా థామస్‌ కథానాయికలు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చారు. సెప్టెంబరు 21న చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ట్రైలర్‌, అందులో ఎన్టీఆర్‌ నటన అద్భుతంగా ఉందంటూ ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు ట్వీట్లు చేశారు. ప్రత్యేకించి ‘జై’ పాత్ర నచ్చిందని చెప్పారు.