బాలకృష్ణ ముహూర్తం పెట్టించారట
‘మెహబూబా’ షూటింగ్‌ ఆరంభం

నందమూరి బాలకృష్ణ ‘మెహబూబా’ చిత్రం షూటింగ్‌ ప్రారంభానికి ముహూర్తం పెట్టించారట. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ తన తనయుడు ఆకాశ్‌ పూరీతో రూపొందిస్తున్న చిత్రమిది. బెంగళూరుకు చెందిన నటి నేహాశెట్టి ఇందులో కథానాయికగా నటిస్తున్నారు. నటి ఛార్మి చిత్ర నిర్మాణ బాధ్యతల్ని చూసుకుంటున్నారు.

కాగా మంగళవారం ఉదయం 8.20 గంటలకు ‘మెహబూబా’ పూజా కార్యక్రమాన్ని హిమాచల్‌ప్రదేశ్‌లో నిర్వహించినట్లు చిత్ర బృందం పేర్కొంది. ఈ సందర్భంగా అక్కడ తీసిన ఫొటోలను సోషల్‌మీడియా వేదికగా పంచుకుంది. ‘నందమూరి బాలకృష్ణ సినిమాను తన వ్యక్తిగతంగా భావించి, మంచి ముహూర్తం పెట్టించారు. బాలకృష్ణ ఉదయం నుంచి ఫోన్లు చేస్తూ, షూటింగ్‌ విషయాల గురించి ఆరా తీస్తున్నారు. చిత్ర బృందాన్ని ఆశీర్వదించారు. మీకు ధన్యవాదాలు సర్‌’ అని చిత్ర బృందం ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసింది.

పూరీ జగన్నాథ్‌-బాలకృష్ణ కాంబినేషన్లో ‘పైసా వసూల్‌’ చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. సెప్టెంబరు 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంలో శ్రియ, ముస్కాన్‌ సేథి, కైరా దత్‌ కథానాయికలుగా నటించారు. ఈ సినిమా నుంచి బాలకృష్ణ తన అభిమాన హీరోగా మారినట్లు పూరీ ఓ సందర్భంలో అన్నారు.