‘అర్జున్‌రెడ్డి’ హీరోయిన్‌కు వరుస అవకాశాలు

‘అర్జున్‌రెడ్డి’ కథానాయిక షాలిని పాండేకు అవకాశాలు వరుస కడుతున్నాయి. విజయ్‌ దేవరకొండతో కలిసి ఆమె నటించిన ఈ చిత్రం విమర్శకులు, ప్రముఖుల ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. ప్రత్యేకించి షాలిని నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమా విడుదల తర్వాత ఆమెకు ‘మహానటి’లో నటించే అవకాశం వచ్చింది. దీంతోపాటు ‘100% లవ్‌’ తమిళ్‌ రీమేక్‌లో తమన్నా పాత్రకు సంతకం చేశారు. కాగా ఇప్పుడు మరో అవకాశం ఆమెను వెతుక్కుంటూ వచ్చినట్లు చిత్ర వర్గాల సమాచారం.

‘ఓకే బంగారం’ ఫేం దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఇంకా టైటిల్‌ ఖరారు చేయని ఈ చిత్రంలో కథానాయిక పాత్ర కోసం దర్శక, నిర్మాతలు షాలినిని సంప్రదించినట్టు తెలుస్తోంది. అయితే ఆమె నటించేందుకు సంతకం చేశారో, లేదో తెలియాల్సి ఉంది.

ఈ చిత్రంలో ఇద్దరు, ముగ్గరు కథానాయికలకు చోటుందట. ఓ రోడ్డు ట్రిప్‌ చుట్టూ కథ సాగనున్నట్లు సమాచారం. రా కార్తిక్‌ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. జె. సెల్వకుమార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ధీన్‌ దయాల్‌ బాణీలు అందిస్తున్నారు. ‘మహానటి’లో దుల్కర్‌ సల్మాన్‌ సావిత్రి భర్త జెమిని గణేశన్‌ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.