Jagan-vijaysai-reddy

వాళ్లిద్ద‌రూ చిర‌కాల స‌న్నిహితులు. వైసీపీకి కీల‌క నేత‌లు. ఒక‌రు పార్టీ అధ్య‌క్షుడ‌యితే మ‌రొక‌రు ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి. ఒక‌రు అసెంబ్లీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉంటే , రెండోవారు పార్ల‌మెంట్ పెద్ద‌ల స‌భ‌లో పార్టీ ప్ర‌తినిధిగా ఉన్నారు. అయితే 2019 కోసం ఇప్పటి నుంచే పక్కా ప్లాన్ రచిస్తున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా ఏక‌కాలంలో రెండు ఎన్నిక‌లు జ‌రుగుతున్న త‌రుణంలో ఇద్ద‌రూ చెరోవైపు బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు.

నంద్యాల ఉప ఎన్నిక‌ల బాధ్య‌త‌ను జ‌గ‌న్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. అక్క‌డే మ‌కాం వేసి మొత్తం వ్య‌వ‌హారాల‌ను చ‌క్క‌దిద్దుతున్నారు. శిల్పా విజ‌యం కోసం చెమ‌టోడుస్తున్నారు. బ‌హిరంగ‌స‌భ విజ‌యవంతం కావ‌డం, తాజాగా రోడ్ షోకి మంచి స్పంద‌న వ‌స్తుండ‌డంతో వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం క‌నిపిస్తోంది. సామాజికంగానూ క‌లిసొచ్చే త‌ర‌గ‌తులు మెజార్టీగా ఉండ‌డ‌మే కాకుండా, ప్రాంతీయంగా సీమ‌లో బాబు మీద వ్య‌తిరేక‌తే కాకుండా, జ‌గ‌న్ మీద ఉన్న సానుభూతి కూడా తోడ్ప‌తుంద‌ని భావిస్తున్నారు. అదే స‌మ‌యంలో టీడీపీలో విబేధాలు కూడా వైసీపీకి తోడ్ప‌డే అంశాలుగా ఉన్నాయి. దాంతో నంద్యాల విష‌యంలో వైసీపీ ఆశ‌లు చిగురులు దాలుస్తున్నాయి.

అదే స‌మ‌యంలో కాకినాడ ఎన్నిక‌లు కూడా ముందుకొచ్చాయి. కోర్ట్ నిర్ణ‌యంతో అనివార్యంగా ముందుకొచ్చిన ఎన్నిక‌లు స్థానిక సంస్థ‌కే అయిన‌ప్ప‌టికీ పార్టీ ప్ర‌భావం చూప‌డం అత్య‌వ‌స‌రంగా మారింది. గ‌డిచిన ఎన్నిక‌ల్లో గోదావ‌రి జిల్లాల్లో చేతులు కాల్చుకున్న త‌ర్వాత జ‌గ‌న్ అక్క‌డ ప‌ట్టుకోసం తీవ్రంగా శ్ర‌మించారు. కీల‌క‌నేత‌లు ప‌లువురిని పార్టీలో చేర్చుకున్నారు. కాకినాడ‌లో కూడా మాజీమంత్రి ముత్తా కుటుంబం, మాజీ ఎమ్మెల్యే క‌న్న‌బాబు వంటి వారు వైసీపీలో చేర‌డం కొంత బ‌లం పెంచింది. దాంతో కాకినాడ ఎన్నిక‌ల్లో పాగా వేయాల‌ని వైసీపీ ఆశిస్తోంది. ఇక్కడ పార్టీ చేరికలు కార్పొరేషన్ ఎన్నికలపై విజయ సాయి రెడ్డి దృష్టిపెట్టారు. దీంతో ఒకరు అక్కడ మరొకరు ఇక్కడ ఉండి దుమ్మురేపుతున్నారు.