అక్టోబ‌ర్ నుంచి ప్ర‌జా క్షేత్రంలో దిగుతాన‌ని, సంస్థాగ‌తంగా పార్టీని బ‌లోపేతం చేస్తాన‌ని జనసేన అధినేత ప‌వ‌న్ ప్ర‌కటించ‌డంతో అంద‌రిలోనూ ఉత్కంఠ మొద‌లైంది. ఆయన ఒంటరిగా బరిలోకి దిగుతారా, లేదా వేరే పార్టీలతో పొత్తు పెట్టుకుంటారా అన్నది ఇప్పటికీ క్లారిటీ లేదు. ఒకవేళ పొత్తుకే వెళితే సాధ్యమైనంతవరకు ఆయన తెదేపాతోనే వెళతారనే చాలామంది భావిస్తున్నారు. ఏదిఏమైనా వచ్చే ఎన్నికల్లో జనసేన పోటీ చేయడం ఖాయంగా తెలుస్తోంది.

అయితే జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎప్పుడు `ఊ` అంటారా.. ఎప్పుడు ఆ పార్టీలోకి వెళిపోదామా? అని ఎంతోమంది నేత‌లు వేచిచూస్తున్నారు. ఈ లిస్టులో తెలుగుదేశం పార్టీ నేత‌లు ముందు వ‌రుస‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్ర‌కాశం జిల్లా గిద్ద‌లూరు నుంచి జనసేన అభ్యర్ధిగా ఇటీవలే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు టికెట్ కన్ఫర్మ్ అయిందనే వార్తలు వస్తున్నాయి. అందుకే ఆయ‌న టీడీపీకి గుడ్‌బై చెప్ప‌బోతున్నార‌నే విష‌యం.. హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

అన్నా రాంబాబుకు గతంలో ప్రజారాజ్యం పార్టీ తరపున రాంబాబు గిద్దలూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ప్రజారాజ్యం విలీనంతో కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారు. ఆపై తెలుగుదేశం పార్టీలోకి వచ్చి గిద్దలూరు నుంచి పోటీ చేశారు. అయితే ప్ర‌స్తుతం వైకాపా తరపున గెలిచిన అశోక్ రెడ్డి తెలుగుదేశంలోకి ఫిరాయించాడు. దీంతో అన్నా రాంబాబు – అశోక్ రెడ్డిల మధ్య విబేధాలు తార‌స్థాయికి చేరాయి. టీడీపీలో ఉంటే టికెట్ దక్కడమూ సందేహమే దక్కినా గెలవడమూ సందేహమ‌నే అభిప్రాయం అయ‌న‌లో మొద‌లైంది. ఈ నేప‌థ్యంలోనే పవన్ పార్టీలోకి చేరిపోవడానికి సిద్ధ‌మైపోయార‌ట‌. అంతేగాక ఆ పార్టీ నుంచి టికెట్ కూడా దాదాపు ఖ‌రారు కావ‌డంతో.. ఇక నుంచి యాక్టివ్ కాబోతున్నార‌ట‌. జ‌న‌సేన‌లోకి ఒక‌సారి వ‌ల‌స‌లు మొద‌లైతే.. ఇక నేత‌లంతా క్యూ క‌ట్టే అవ‌కాశాలు లేక‌పోలేదు. దీనిని ప్రధాన పార్టీల వారు ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి.