NTR

విభిన్నమైన పాత్రలను ఎంచుకోవడం, సినిమాలను సెలెక్ట్ చేసుకోవడంలో యువ హీరో నారా రోహిత్‌ది ప్రత్యేకమైన పంథా. ఆయన నటించిన తొలి చిత్రం బాణం డిఫరెంట్ ఫిలింగా విమర్శకుల ప్రశంసలందుకొన్నది. ఆ తర్వాత నారా రోహిత్ చేసిన సావిత్రి, అసుర, జో అచ్చుతానంద, అప్పట్లో ఒకడుండేవాడు ఆయన అభిరుచికి అద్దం పట్టాయి. తాజాగా శమంతకమణి అనే మల్టీ స్టారర్ చిత్రంలో మరోసారి పోలీస్ పాత్రలో కనిపించారు. ఈ చిత్రం జూలై 14న విడుదల అవుతున్న సందర్భంగా ఆ సినిమా విశేషాలను నారా రోహిత్ మీడియాతో పంచుకొన్నారు.

శమంతకమణి చిత్రం చాలా మంచి సినిమా. మల్టీ స్టారర్ సినిమాలో ఇద్దరు హీరోలు కలిసి నటించాలంటే చాలా కష్టం. అలాంటిది నలుగురు హీరోలు కలిసి నటించడం మామూలు విషయం కాదు. ఈ సినిమా స్క్రిప్ట్ చాలా బాగుంది. ఏ హీరోకు కావాల్సిన స్పేస్‌లో వారికి క్యారెక్టర్లు ఉన్నాయి. అందుకే ఎలాంటి సమస్యలు రాలేదు.

ఈ చిత్రంలో పోలీస్ పాత్ర. ఈ మధ్యకాలంలో పోలీస్ పాత్ర పోషించడం నాలుగో సారి. ఈ చిత్రంలో నా పాత్ర చాలా టిపికల్. ఎప్పుడు కోపం వస్తుందో.. ఎప్పుడు మామూలుగా ఉంటుందో నాకే తెలీదు. పోలీసు పాత్రలో నటించ వద్దని అనుకొన్నాను. కానీ కథ విన్నాక నటించాలని అనుకొన్నాను. రంజిత్ కుమార్ పాత్ర చాలా కొత్తగా ఉంది. న్యూ డైమన్షన్ కనిపిస్తుంది. ఈ కథలో కారుది ప్రధాన పాత్ర. కారును దొంగిలించిన నలుగురు అనుమానితుల గురించి దర్యాప్తు చేస్తుంటాం. మిగితా విషయాలన్నీ తెరపైనే చూస్తేనే బాగుంటుంది.

శమంతకమణి చిత్రంలో ఈ పాత్ర నాకు దక్కినందుకు ముందు శౌర్యకి ధన్యవాదాలు చెప్పాలి సినిమాలో నాతో పాటు నలుగురు హీరోలు ఉన్నారు. ప్రతీ పాత్ర కథలో కీలకమే. ఎవరిదీ ఎక్కువా తక్కువా అనిలేదు. నలుగురు హీరోలతో మంచి క్వాలిటీతో ఏ విషయంలోనూ రాజీ పడకుండా ఈ సినిమాను కేవలం 37 రోజుల్లో పూర్తిచేశాడు దర్శకుడు శ్రీరాం. ఆ క్రెడిట్‌ అంతా ఆయనకే. రంజిత్ కుమార్ పాత్ర కాకుండా నాకు నచ్చిన పాత్ర సుధీర్ పాత్ర. ఆ పాత్ర సెంటిమెంట్‌తో కూడుకొన్నది.

కథలోరాజకుమారి, వీరభోగ వసంతరాయలు, పవన్ సాదినేని చిత్రాల్లో నటిస్తున్నాను. వీరభోగ వసంతరాయలు చిత్రం కొత్తగా ఉంటుంది. ఈ సినిమా పేరు విని అంతా చారిత్రాత్మక చిత్రం అని అనుకుంటున్నారను. కానీ ఇదో కమర్షియల్‌ చిత్రం. హిందీలో వెడ్‌నెస్ డే సినిమా మాదిరిగా ఉంటుంది. చాలా డిఫరెంట్‌గా.. కొత్త జోనర్‌గా ఉంటుంది. టెర్రరిజం బ్యాక్ డ్రాప్‌గా సినిమా కథ సాగుతుంది. ఈ చిత్రంలో సుధీర్‌బాబు కూడా నటిస్తున్నాడు.

రంజిత్ కుమార్ పాత్ర కొండవీటి సింహంలో ఎన్టీఆర్ పాత్ర పేరని, రౌడీ ఇన్స్‌పెక్టర్ చిత్రంలో బాలకృష్ణ పాత్ర పేరని తెలియదు. శమంతకమణి చిత్రం ఫస్ట్‌లుక్ వచ్చిన తర్వాత నా స్నేహితుడు మెసేజ్ చేస్తే నాకు తెలిసింది. అప్పటివరకు నాకు తెలియదు. షూటింగ్‌లో డైలాగ్స్ చదువుకుంటూ వెళ్లాను అని నారా రోహిత్ చెప్పారు.